అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ
గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను తమ ఖాతాలో వేసుకుంటున్నారు
జీవోలు, మంజూరు ఉత్తర్వులతో కాంగ్రెస్ ప్రచారానికి బీఆర్ఎస్ కౌంటర్
మార్కెట్ కూల్చివేతపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ప్రజా సమస్యలు పరిష్కరించకుండా తప్పుడు ప్రచారం తగదు
బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, ఆర్.జె.సి. కృష్ణ, బి.రెడ్డి నాగచంద్రారెడ్డి
కాకతీయ, ఖమ్మం బ్యూరో : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం అభివృద్ధికి మంజూరు చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు తామే తీసుకొచ్చినవిగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, ఆర్.జె.సి. కృష్ణ, బి.రెడ్డి నాగచంద్రారెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ జీవోలు, మంజూరు ఉత్తర్వులు, అధికారిక పత్రాలను మీడియా ముందు ప్రదర్శించారు. ‘‘మేం మాటలతో ఆరోపణలు చేయడం లేదు.. జీవోలు, మంజూరు ఉత్తర్వులు, అధికారిక ఆధారాలతో మాట్లాడుతున్నాం. మేం చెప్పింది తప్పని నిరూపించేందుకు కాంగ్రెస్ నాయకులు కూడా ఆధారాలతో రావాలి’’ అని సవాల్ చేశారు.
మున్నేరు పనులకు జీవోలే సాక్ష్యం
2023లోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్నేరు ఇరువైపులా సీసీ వాల్, మున్నేరుపై సస్పెన్షన్ బ్రిడ్జి, ఖమ్మం మెడికల్ కాలేజీ పరిధిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి కీలక పనులు మంజూరయ్యాయని తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని కొనసాగించడం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతేనని, అయితే మంజూరు చేసిన పనులను తామే తీసుకొచ్చినట్లు చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. ఖమ్మం నగర అభివృద్ధిలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాత్రను ప్రజలు మర్చిపోలేరని పేర్కొన్నారు. గొల్లపాడు ఛానల్ అభివృద్ధి, పార్కులు, ప్రధాన రహదారులు, సెంట్రల్ లైటింగ్, వైకుంఠధామాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, కూడళ్ల సుందరీకరణ, ప్రకాశ్‌నగర్ చెక్‌డ్యామ్ తదితర పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని గుర్తుచేశారు.
మార్కెట్ విషయంలో ప్రజాధనం వృథా
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలో సుమారు రూ.11.34 కోట్లు కేటాయించి షెడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ప్రస్తుతం వాటిని తొలగించి కొత్త మార్కెట్ నిర్మాణం చేపట్టడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. సుమారు రూ.10 కోట్లతో నిర్మించిన పనులను కూల్చివేసి, దాదాపు రూ.కోటి విలువైన షెడ్లను ధ్వంసం చేసి, అదే స్థలంలో రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. గతంలో ఖర్చు చేసిన నిధులు, కూల్చివేసిన ఆస్తుల విలువ, కొత్త మార్కెట్‌కు అయ్యే వ్యయం, పాత నిర్మాణాలను ఎందుకు వినియోగించలేదనే అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్ఆర్ రోడ్ బాధితులకు న్యాయం చేయాలి
ఎస్ఆర్ రోడ్ విస్తరణలో ప్రభావితమైన సుమారు 170 కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు. ఇళ్ల ముందు ర్యాంపులు, మెట్లు తొలగించుకున్న కుటుంబాలకు హామీ ఇచ్చిన టి.డి.ఆర్ మంజూరు చేయాలని, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ స్థలం లేదా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ హయాంలో స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేసి ప్రారంభించిన షాదీఖానా నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మైనార్టీలకు ఇచ్చిన హామీ మేరకు షాదీఖానాను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. భూదాన్ బాధితులు, రఘునాథపాలెం సర్వే నంబర్ 20018 బాధితులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులను తమ ఖాతాలో వేసుకోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని హితవు పలికారు. ‘‘మేం చేసిన పనులకు జీవోలు, మంజూరు ఉత్తర్వులు, ప్రభుత్వ రికార్డులు ఉన్నాయి. అవసరమైతే ప్రజల ముందూ వాటిని పెడతాం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం.. మాటలతో కాదు, ఆధారాలతో చర్చకు సిద్ధం’’ అని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ గ్రంథాలయ చైర్మన్ కమర్, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బుల్, మాటేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

