అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలం
పల్లెగూడెం సమగ్ర అభివృద్ధికి రూ.61.76 కోట్లు
ప్రభుత్వ, అసైన్డ్ భూములను అర్హులకు కేటాయిస్తాం
రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం: మంత్రి పొంగులేటి
కాకతీయ, ఖమ్మం : అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెగూడెంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను గ్రామంలోని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, ఆక్రమణలను గుర్తించిన వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రూ.61.76 కోట్లతో అభివృద్ధి పనులు
పల్లెగూడెం సమగ్ర అభివృద్ధికి రూ.61.76 కోట్లతో వివిధ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. గొల్లగూడెం నుంచి పల్లెగూడెం వరకు ఎన్‌ఎస్‌పీ కాల్వ గట్టుపై రూ.5.80 కోట్లతో మోడల్ సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పల్లెగూడెం నుంచి మంగళగూడెం వరకు రూ.55 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
కొత్త అంగన్‌వాడీ భవనానికి రూ.12 లక్షలు
రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని రెండు నెలల్లోనే నాణ్యతతో పూర్తి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు రూ.12 లక్షలతో నూతన అంగన్‌వాడీ భవనాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్హులైన వయోవృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పింఛన్ల కోసం ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ జిల్లాలో 110 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరై, నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణం తుది దశలో ఉందన్నారు. 20 చోట్ల వీవో భవనాలకు స్థల సమస్య ఉన్నట్లు గుర్తించామని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్‌రావు, పీఆర్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, ఈఈ మహేష్‌బాబు, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఏదులాపురం మునిసిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పల్లెగూడెం సర్పంచ్ చుండూరి సుజన కృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

