నిరుద్యోగ సమస్యపై సీపీఎం మహాధర్నా
ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి
నిరుద్యోగ యువతతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం
సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
కాకతీయ, ఖమ్మం టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చాయని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఆ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్వహించిన నియామకాలు, ప్రస్తుత ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు కలిపినా 60 వేలకుపైగా లేవని ఆరోపించారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగ యువత, ప్రజాసంఘాలను కలుపుకొని పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పోన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, మాదినేని రమేష్, యర్రా శ్రీనివాస్‌రావు, బండి పద్మ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

