ఎస్సారెస్పీ కాలువలతో రైతులను ఆదుకోవాలి
తుంగతుర్తి ప్రాంతానికి నీటిని విడుదల చేయాలి
వర్షాభావంతో ఎండుతున్న వరి పంటలు
చెరువులు నింపి భూగర్భ జలాలను పెంచాలి
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు
కాకతీయ, తుంగతుర్తి : ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి తుంగతుర్తి ప్రాంత రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. తుంగతుర్తిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావంతో తుంగతుర్తి ప్రాంతంలో రైతులు సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ గోదావరి జలాలతో నిండి ఉన్నందున కాలువల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని కోరారు. భూగర్భ జలాలు అడుగంటిన పరిస్థితుల్లో చెరువులు నిండితే బావులు, బోర్లలో నీటి లభ్యత పెరిగి పంటలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే యూరియా కొరత, ఎరువుల ధరల పెరుగుదలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వీడి రైతుల సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. అర్హులైన వారికి పింఛన్లు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను రాజకీయాలకు అతీతంగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండలంలోని అధ్వానంగా మారిన లింకు రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాసు, పులుసు సత్యం, మండల కార్యదర్శులు దేవరకొండ యాదగిరి, జి.ఉప్పలయ్య పాల్గొన్నారు.

