ఇదేం అన్యాయం..!?
కుడా చైర్‌పర్సన్‌గా సుధారాణి నియామకంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి
పార్టీ అధికారంలోకి వచ్చాక చేరిన నాయకురాలికి అందలం
ఏళ్లుగా కష్టపడిన నేతలకు,నాయకురాళ్లకు దక్కని పదవులు
పాత టీడీపీ నేతలకే నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయంటూ విమర్శలు
పద్మశాలి సామాజిక వర్గం నుంచి లీడర్లే లేరా..?!
పార్టీకి ఏం సేవ చేశారని, ఏం తొదర వచ్చిందని ఆమెకు ఇచ్చారంటూ అసంతృప్తి
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలను రగులుస్తున్న కుడా చైర్‌పర్సన్ నియామకం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి నియామకం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగిలిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన నాయకురాలికి కీలకమైన నామినేటెడ్ పదవి కట్టబెట్టడంపై పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నేతలను పక్కనపెట్టి, ఎన్నికల సమయంలోనో.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనో వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుధారాణి నియామకం వెనుక సామాజిక సమీకరణాలున్నాయన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ.. పార్టీ కోసం కష్టపడిన తమకు మాత్రం ఎందుకు గుర్తింపు దక్కడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు నుంచి జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గాలు, జిల్లాల స్థాయిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ కాంగ్రెస్‌కు అండగా నిలిచిన నాయకుల్లో చాలామందికి ఇప్పటికీ సరైన గుర్తింపు లభించలేదన్న అసంతృప్తి ఉంది. నామినేటెడ్ పదవుల భర్తీ సందర్భంగా తమను పరిగణనలోకి తీసుకుంటారని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోందని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కుడా చైర్‌పర్సన్ పదవిని సుధారాణికి కేటాయించడంతో ఈ అసంతృప్తి మరింత బహిర్గతమవుతున్నట్లు సమాచారం.
పాత టీడీపీ నేతలకే పదవులా?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన పలువురు నేతలకు ప్రాధాన్యం లభిస్తోందన్న విమర్శలు ఇప్పటికే పార్టీలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయంటూ కాంగ్రెస్‌లోని పాత నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం సంవత్సరాల తరబడి పనిచేసిన తమను పక్కనబెట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా సుధారాణి నియామకం కూడా ఇదే కోణంలో పార్టీలో చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది. పదవి ఇవ్వడానికి ఆమెకు ఉన్న ప్రత్యేక అర్హత ఏమిటి? పార్టీ కోసం చేసిన సేవ ఏమిటి? అనే ప్రశ్నలు కొందరు నేతల నుంచి వినిపిస్తున్నట్లు సమాచారం.
పద్మశాలి వర్గం నుంచి లీడర్లే లేరా..?!
సుధారాణి నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలు సామాజికవర్గం అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మశాలి సామాజికవర్గం నుంచి కాంగ్రెస్‌లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న నాయకులు, నాయకురాళ్లు ఉన్నప్పటికీ వారిని కాదని సుధారాణికే కీలక పదవి ఎందుకు ఇచ్చారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకుని పనిచేసిన వారిని గుర్తించకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయి కార్యకర్తల్లో నిరుత్సాహం ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. పద్మశాలి వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశమే ఉంటే.. కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకుల్లోనే ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అసంతృప్తి జ్వాలలు రగిలిస్తున్న నియామకం
కుడా చైర్‌పర్సన్ పదవి భర్తీతో కాంగ్రెస్‌లో అంతర్గతంగా నెలకొన్న అసంతృప్తి మరోసారి తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు దక్కకపోవడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం లభించడం కొనసాగితే భవిష్యత్‌లో పార్టీపై దాని ప్రభావం పడుతుందని కొందరు నాయకులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. సుధారాణికి పదవి ఇవ్వడంపై బహిరంగంగా మాట్లాడేందుకు వెనుకాడుతున్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ‘పార్టీ కోసం ఏం సేవ చేశారని పదవి ఇచ్చారు? ఏం తొందర వచ్చింది?’ అంటూ కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరుకు మరింత ఆజ్యం పోస్తుందా? అన్న చర్చ కూడా మొదలైంది. పార్టీ అధిష్ఠానం ఈ అసంతృప్తిని ఎలా చల్లారుస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

