మామునూరు విమానాశ్రయానికి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి
ఇనుగుర్తి మండల గౌడ యువజన సంఘం అధ్యక్షులు మద్దెల సుధాకర్ గౌడ్
కాకతీయ, ఇనుగుర్తి : వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి తగిన పేరును సూచించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ప్రజలను కోరిన నేపథ్యంలో, ఉమ్మడి వరంగల్ ప్రాంత చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును విమానాశ్రయానికి పెట్టాలని ఇనుగుర్తి మండల గౌడ యువజన సంఘం అధ్యక్షులు మద్దెల సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా గురువారం సుధాకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని, కాకతీయుల చారిత్రక వైభవంతో పాటు తెలంగాణ సామాజిక చరిత్రలోనూ ఈ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ చారిత్రక ప్రాంతంలో నిర్మిస్తున్న మామునూరు విమానాశ్రయానికి తెలంగాణ వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టడం సముచితమని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో ప్రముఖ పోరాట యోధుడిగా గుర్తింపు పొందారని, సామాన్య ప్రజల ఆత్మగౌరవం, సమానత్వం కోసం పోరాడిన చారిత్రక వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని పాపన్న గౌడ్ చరిత్రను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని, వరంగల్ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురానున్న మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం – వరంగల్ గా నామకరణం చేస్తే ఆయన చరిత్రకు తగిన గౌరవం దక్కుతుందని అన్నారు.

