లంచాల నిలయంగా ఏటూరునాగారం ఆసుపత్రి
వైద్య సేవల పేరుతో వసూళ్ల ఆరోపణలు
సర్టిఫికెట్లకూ డబ్బులు వసూలు చేస్తున్నారా?
ఎస్‌ఎఫ్‌ఐ ములుగు జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి డిమాండ్
కాకతీయ, ఏటూరునాగారం : ఏజెన్సీ ప్రాంతంలోని పేద, గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందించాల్సిన ఏటూరునాగారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ ములుగు జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి తెలిపారు. ఆరోపణలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐదారు మండలాల నుంచి ప్రతిరోజూ వందలాది మంది పేదలు, గిరిజనులు ఆసుపత్రికి వస్తుంటారని, ప్రభుత్వ సేవలకు కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తే వారిపై అదనపు ఆర్థిక భారం పడుతుందని అన్నారు. వైద్య సేవలతో పాటు జనన ధ్రువీకరణ పత్రాలు వంటి ఇతర సేవల విషయంలోనూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రవి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ, జిల్లా ఉపాధ్యక్షుడు కోగిల బాలు తదితరులు పాల్గొన్నారు.

