యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ పాట విడుదల
50 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన
ఎన్ఎస్ఎస్ సేవలకు గుర్తుగా పూర్వ వాలంటీర్లకు సన్మానం
వీసీ కర్నాటి ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్ర
కాకతీయ, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయం 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సెల్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ 50 ఏళ్ల చరిత్ర, విద్యార్థి ఉద్యమాలు, సామాజిక సేవలు, విద్య, పరిశోధన ప్రస్థానాన్ని ప్రతిబింబించే యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ పూర్తి పాటను విడుదల చేశారు. ఎన్ఎస్ఎస్ సెల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసన్ నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాపరెడ్డి ముఖ్యఅతిథిగా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్ర విశిష్ట అతిథిగా హాజరయ్యారు. గతంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లుగా పనిచేసిన ప్రొఫెసర్ సీతారాం నాయక్, ప్రొఫెసర్ వెంకటనారాయణ, ప్రొఫెసర్ సురేష్‌లాల్, ప్రొఫెసర్ జ్యోతి, ఎం.శంకరయ్యతో పాటు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. పూర్వ కోఆర్డినేటర్లు, ప్రోగ్రాం అధికారులు, సీనియర్ వాలంటీర్లను సన్మానించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్కు ప్రత్యేక భవన నిర్మాణానికి కృషి చేస్తామని వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాపరెడ్డి తెలిపారు. అనంతరం వైస్‌చాన్స్‌లర్, రిజిస్ట్రార్ కలిసి యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ పాటను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల పోరాటం, సామాజిక కార్యక్రమాలు, పరిశోధనలు, ఉన్నత విద్యలో యూనివర్సిటీ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా పాటను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. నేరెళ్ల దేవేందర్ రచించగా, ఇనుగుర్తి మధు ఆలపించారు. రాచకొండ ప్రవీణ్, గుంపెల్లి గౌతమ్ నిర్మాతలుగా వ్యవహరించారు. జబర్దస్త్ కళాకారులు, గాయకులు, వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నృత్యాలు, గేయాలతో అలరించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కన్వీనర్లు, ప్రోగ్రాం అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

