డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు
బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్, జహీరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు
8 మంది ఇళ్ల నుంచి కీలక పత్రాలు, ఆధారాలు స్వాధీనం
బొమ్మ వెంకటేష్ ఇంట్లో రూ.1.35 కోట్ల నగదు
విదేశీ కరెన్సీ, 14 లీటర్ల మద్యం పట్టివేత
కాకతీయ, హైదరాబాద్ : అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న 8 మంది ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జహీరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. భీమ్‌రెడ్డితో ఆర్థిక, ఇతర లావాదేవీలు ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్ల నుంచి కీలక పత్రాలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బొమ్మ వెంకటేష్ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.1.35 కోట్ల అక్రమ నగదును గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నగదుతోపాటు భారీగా విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సోదాల్లో లభించిన పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. బొమ్మ వెంకటేష్ ఇంట్లో సుమారు 14 లీటర్ల విదేశీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అక్రమ మద్యం వ్యవహారాన్ని ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. అక్రమ మద్యానికి సంబంధించి ఎక్సైజ్ చట్టాల ప్రకారం సంబంధిత పోలీసులు కేసు నమోదు చేస్తారని ఏసీబీ అధికారులు తెలిపారు. భీమ్‌రెడ్డితో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

