ఇందిరమ్మ లబ్ధిదారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి
అక్టోబర్ 1 నుంచి స్లాబ్ విస్తీర్ణంపై పరిమితి
750 చదరపు అడుగులకు మించి నిర్మించరాదు
నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్ సూచన
కాకతీయ, నెల్లికుదురు : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఎంపీడీవో సింగారపు కుమార్ సూచించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూఫ్ లెవల్ దశకు చేరుకున్న లబ్ధిదారులు స్లాబ్ నిర్మాణానికి ముందు ప్రభుత్వ నిబంధనలు పరిశీలించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఆర్‌టీ నంబర్ 495, టీఆర్ అండ్ బీ (హౌసింగ్) శాఖ, తేదీ 19.09.2026 ప్రకారం.. జీవో ఆర్‌టీ నంబర్ 352, తేదీ 27.06.2026లో నిర్దేశించిన స్లాబ్ విస్తీర్ణ పరిమితుల అమలును సెప్టెంబరు 30 వరకు వాయిదా వేసినట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి నిబంధనలు కచ్చితంగా అమల్లోకి వస్తాయన్నారు. ఆ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ విస్తీర్ణం 750 చదరపు అడుగులకు మించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడితే అందుకు సంబంధించిన పరిణామాలకు లబ్ధిదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఈ విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేసి, నిబంధనలు అమలయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సూచించారు.

