ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి
ఆక్రమణలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి
ప్రభుత్వ భూములపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
కాకతీయ, హనుమకొండ : ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కాజీపేట మండలం మడికొండ గ్రామంలో క్రైస్తవ, ముస్లిం మతస్తులకు స్మశాన వాటికల కేటాయింపునకు ప్రతిపాదించిన స్థలాన్ని సోమవారం పరిశీలించారు. స్థల విస్తీర్ణం, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, భూమికి సంబంధించిన రికార్డుల వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్మశాన వాటికల కేటాయింపునకు సంబంధించి క్షేత్రస్థాయిలో స్థల, రికార్డుల పరిశీలన పూర్తి చేసి నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్డీఓ వెంకటేష్, కాజీపేట తహసీల్దార్ రాజును ఆదేశించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వాటి చుట్టూ స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు రికార్డులను క్షేత్రస్థాయి వివరాలతో సరిపోల్చి పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. అనధికార ఆక్రమణలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని, ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రాధాన్యతతో చేపట్టాలని ఆదేశించారు. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భూములను కేటాయించే సమయంలో భూమి స్థితిగతులు, రికార్డులు, స్థల అనుకూలత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి ప్రతిపాదనలు త్వరితగతిన సమర్పించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ రాజు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

