జ్వరాలపై పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ
కాకతీయ, చందుర్తి: సీజనల్ వ్యాధుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా చందుర్తి మండలం లింగంపేటలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్థులకు జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలపై వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా ఇళ్ల పరిసరాలు, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొక్కుల నరేష్, ఉపసర్పంచ్ ఆకుల ఎల్లయ్య, పంచాయతీ కార్యదర్శి లింగమూర్తి, డాక్టర్ రేణుక, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

