జ్ఞానేశ్ కుమార్‌ను ఈసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలి
ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి
అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తే పునరుద్ధరించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. దావూద్ డిమాండ్
కాకతీయ, ఏటూరునాగారం : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. దావూద్ డిమాండ్ చేశారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించి ఉంటే వెంటనే పరిశీలించి పునరుద్ధరించాలని కోరారు. ఎన్నికల జాబితా సవరణపై సమగ్ర విచారణ జరిపి ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతపై ప్రజల్లో విశ్వాసం నిలిచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రవి, తోలెం కృష్ణయ్య, సురేష్, కోరం చిరంజీవి, కర్నె లాజర్, సంపత్, సమ్మయ్య, నరసింహులు, పూనెం నగేష్ తదితరులు పాల్గొన్నారు.

