350 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం
అధిక శబ్దంతో ప్రజలకు అసౌకర్యం
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు
కాకతీయ, హన్మకొండ : వాహనాల్లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసి అధిక శబ్దం వచ్చేలా వినియోగిస్తున్న సైలెన్సర్లపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ మైదాన్ సర్కిల్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న సుమారు 350 మార్పు చేసిన సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. వాహనాల సైలెన్సర్లను మార్చి అధిక శబ్దం వచ్చేలా వినియోగించడం వల్ల శబ్ద కాలుష్యం పెరగడంతోపాటు ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని రాయల ప్రభాకర్‌రావు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. వాహనదారులు కంపెనీ అమర్చిన అసలైన సైలెన్సర్లనే వినియోగించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను మార్చి అధిక శబ్దం వచ్చేలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ టి. సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు సుజాత, ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


