పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్
రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంటుకు సిరివెన్నెల దీక్షిత్ ఎంపిక
విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందించాలి
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచన
కాకతీయ, నెల్లికుదురు : మహబూబాబాద్ జిల్లా ఐడీఓసీలో పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై అవగాహన పెంపొందించడంతోపాటు సభ నిర్వహణ, చర్చ, ప్రశ్నించడం, సమాధానం ఇవ్వడం వంటి ప్రజాస్వామ్య విలువలను ఆచరణాత్మకంగా నేర్పడం కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఇన్‌చార్జి డీఈవో శ్రీరాములు, డీఎస్‌ఓ అప్పారావు, ఏఎంఓ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. నెల్లికుదురు మండలం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కన్వీనర్ ఉపేందర్‌రావు, ఆర్గనైజర్ అంజుమ సుల్తానా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్‌గా సాయి వర్షిత, ప్రధానమంత్రిగా దీక్షిత్ వ్యవహరించగా.. రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంటుకు సిరివెన్నెల దీక్షిత్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎదుర్కొనే విధానం, నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిపై మాక్ పార్లమెంట్ ద్వారా విద్యార్థులకు అవగాహన పెరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించిన అంజుమ సుల్తానాను కలెక్టర్ అభినందించారు. జిల్లా సోషల్ స్టడీస్ ఫోరం అధ్యక్షుడు ఏ. బ్రహ్మానందరెడ్డి, గైడ్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

