పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి
కాకతీయ, వరంగల్ బ్యూరో :రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వరంగల్ సెంట్రల్ లైబ్రరీని సందర్శించిన ఆయన వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు భిన్నమైనవని అన్నారు. ఉన్నత విద్యావంతులు, మేధావులు, సమాజంపై అవగాహన కలిగిన పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. అందువల్ల పట్టభద్రులు ఇచ్చే తీర్పుకు ఎంతో విలువ ఉంటుందని, తమ కోసం నిరంతరం పోరాడే వారికి మద్దతుగా నిలవాలని కోరారు. ఎన్నికల సమయంలో మాత్రమే హడావుడి చేసి, ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో లేని వారికి ఓటుతో సమాధానం చెప్పాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని రాకేష్ రెడ్డి విమర్శించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు కావస్తున్నా, పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రైవేట్ రంగంలో తెలంగాణ యువతకు 75 శాతం ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, కళాశాల విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. యువత, నిరుద్యోగుల సమస్యలపై గత రెండేళ్లుగా తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోందని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. జీవో 46 రద్దు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు, జీవో 29 రద్దు కోసం కూడా పోరాటం చేశామని గుర్తుచేశారు. పట్టభద్రులు, నిరుద్యోగ యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.


