పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
సవరన్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం దువా
కాకతీయ, కరీంనగర్: సమాజ శాంతి, భద్రతల కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్లోని సవరన్ మసీదులో సీపీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది క్షేమం, ప్రజా సంక్షేమం కోసం ప్రత్యేక దువా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు యాదగిరిస్వామి, వెంకటస్వామి, విజయకుమార్, టౌన్, ట్రాఫిక్ సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

