పోక్సో కేసులో ఏడుగురు అరెస్ట్!
నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్
డ్రగ్స్ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు
చేర్యాల సీఐ బానోత్ రమేష్ నాయక్ వెల్లడి
కాకతీయ, మద్దూర్: మద్దూర్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు చేర్యాల సీఐ బానోత్ రమేష్ నాయక్ వెల్లడించారు. బాధితురాలు మైనర్ కావడంతో పాటు, నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నందున వారి వ్యక్తిగత వివరాలు, గుర్తింపును వెల్లడించే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు పోలీసులు తెలిపారు. హుస్నాబాద్ ఏసీపీ సదానందం పర్యవేక్షణలో నిందితులకు ర్యాపిడ్ కిట్ ద్వారా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించినట్లు సీఐ పేర్కొన్నారు. పరీక్షల్లో వారు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ కాలేదని వెల్లడించారు. మైనర్ల గోప్యతను కాపాడుతూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

