పరకాల రాజకీయాల్లో ఫ్లెక్సీ ఫైట్!
పోచంపల్లి వర్సెస్ చల్లా వర్గీయుల మధ్య రాజకీయ పోరు
పరకాల బీఆర్ఎస్లో బహిర్గతమైన విభేదాలు
ఎమ్మెల్సీ ఫ్లెక్సీలు చించివేతతో మొదలైన వివాదం
చల్లా పేరు ప్రస్తావించకుండానే మాట్లాడిన ఎమ్మెల్సీ పోచంపల్లి
స్థానికతను ప్రస్తావిస్తూ పరకాలకు పూర్వ వైభవం తెస్తానని ప్రకటన
ప్రతి ఇంటికీ అండగా ఉంటానంటూ వ్యాఖ్యలు

కాకతీయ, హనుమకొండ : పరకాల బీఆర్ఎస్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వర్గాల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఫ్లెక్సీల వివాదం రాజకీయ వేడిని పెంచింది. టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా పోచంపల్లి హాజరయ్యే నేపథ్యంలో ఆయన ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, వాటిలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫొటో లేదంటూ ఆయన అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోచంపల్లి వర్గీయులతో వాగ్వాదానికి దిగిన చల్లా వర్గీయులు ఫ్లెక్సీలను చించివేసినట్లు సమాచారం. దీంతో పరకాలలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఫ్లెక్సీల వివాదం నడుమ క్రికెట్ టోర్నమెంట్‌కు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తన ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేరును నేరుగా ప్రస్తావించలేదు. ఫ్లెక్సీల వ్యవహారంలో జరిగిన ఘటనను సంబంధిత వ్యక్తుల విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. నిర్వాహకులను అభినందిస్తూ క్రీడా కార్యక్రమాలకు రాజకీయ వివాదాలను ఆపాదించవద్దన్న సంకేతాలిచ్చారు. అయితే సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

స్థానికతను తెరపైకి తెచ్చిన ఎమ్మెల్సీ
తాను పరకాలలో పుట్టిన బిడ్డనని, ఈ ప్రాంతంతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని పోచంపల్లి పేర్కొన్నారు. స్థానికుడిగా పరకాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య వర్గాల విజ్ఞప్తి మేరకే తాను స్థానిక కార్యక్రమాలకు హాజరవుతున్నానని, పరకాలలో ప్రతి ఇంటికీ అండగా ఉండటమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. చల్లా ధర్మారెడ్డి పేరును ప్రస్తావించకుండానే స్థానికత అంశాన్ని ప్రస్తావించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు పోచంపల్లిని ఆహ్వానించడంతో ఆయన ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సమాచారం ఇవ్వలేదని, ఆయన ఫొటోను ఫ్లెక్సీల్లో పెట్టలేదని చల్లా వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఫ్లెక్సీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో పరకాల పట్టణంలో బీఆర్ఎస్ అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు బహిరంగ కార్యక్రమాలకూ విస్తరించడం స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. పోచంపల్లి వ్యాఖ్యలు, చల్లా వర్గం అభ్యంతరాలు, ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో పరకాల బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు ఎటువైపు దారితీస్తుందన్న ఆసక్తి నెలకొంది.


