బాలలు రోల్ మోడల్‌గా ఎదగాలి : కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
కాకతీయ, హనుమకొండ : బాలలు తమకు తామే ఆదర్శంగా నిలవడంతో పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఎదగాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు. శనివారం హనుమకొండ సుబేదారిలోని అసుంత నిలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అభినందించారు. పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, తమ సమస్యలను అధికారులకు నిర్భయంగా తెలియజేయాలని సూచించారు. వేడుకల్లో బాలికల కోరిక మేరకు కలెక్టర్ వారితో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. అనంతరం చిన్నారులతో సెల్ఫీలు దిగారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ప్రారంభించారు. వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ అనిల్ చందర్రావు, బాలల పరిరక్షణ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

