ఉద్యమకారులకు సొంత ఇళ్లు లేవు
ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో సతమతం
రాష్ట్ర సాధన కోసం సర్వస్వం కోల్పోయాం.. గుర్తింపు కరువైందని ఆవేదన
225 మంది ఉద్యమకారుల కుటుంబాల కన్నీటి గాథలు!
రెండు దశల్లో ఉద్యమకారుల ఇళ్లకు వెళ్లి మనోగతం నమోదు
మూడో దశ ఓదార్పు యాత్ర హనుమకొండ జిల్లాలో: గుడిమళ్ల రవికుమార్
కాకతీయ, హనుమకొండ : “తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వస్వం కోల్పోయిన ఉద్యమకారులకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారు నేడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో జీవిస్తున్నారు. వారి కుటుంబాల కన్నీటి గాథలు వింటుంటే బాధ కలుగుతోంది. ఉద్యమకారుల హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది, ఉద్యమ నేత గుడిమళ్ల రవికుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు దశల్లో నిర్వహించిన ఓదార్పు యాత్రలో 225 మంది ఉద్యమకారులు, వారి కుటుంబాలను కలిసి వారి మనోగతాన్ని నమోదు చేసినట్లు తెలిపారు. వారిలో 80 శాతం మందికి సొంత ఇళ్లు లేవని, అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు ఏదీ?
ఓదార్పు యాత్రలో కలిసిన ఉద్యమకారులు, వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారని రవికుమార్ తెలిపారు. తెలంగాణ కోసం సర్వస్వం కోల్పోయినా ఏ నాయకుడూ తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఉద్యమకారులను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని, హక్కుల సాధన కోసం పోరాటాన్ని కొనసాగించాలని కోరినట్లు వెల్లడించారు. హనుమకొండ నగరంలో ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో ఉన్నందున మూడో దశ ఓదార్పు యాత్రను ప్రతి శని, ఆదివారాల్లో హనుమకొండ జిల్లాలో నిర్వహిస్తామని ప్రకటించారు. రెండో దశ యాత్ర విజయవంతానికి సహకరించిన ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు సాంగులాల్ మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమకారులను ఉపయోగించుకుని తర్వాత విస్మరించారని విమర్శించారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారిని ఉద్దేశపూర్వకంగా అణచివేశారని ఆరోపించారు. ఉద్యమకారులందరూ రాజకీయాలకు అతీతంగా ఏకమై హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ వొడపెల్లి శ్యామ్‌కృష్ణ, తొలి దశ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు టి.ఎన్. స్వామి, తొలి దశ ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు రాంబ్రహ్మచారి, దాసరి జనార్దన్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు షేక్ ఉస్మాన్ అలీ, బొలిశెట్టి అశోక్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చాంద్ పాషా, ప్రధాన కార్యదర్శి బొచ్చు కుమార్, మహిళా అధ్యక్షులు మాలతీ లత, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

