అక్రమ నిర్మాణాలు కూల్చివేత!
స్వచ్ఛందంగా తొలగించకుంటే జేసీబీలతో చర్యలు
పార్కులు, ఉమ్మడి స్థలాల ఆక్రమణలను సహించేది లేదు
నిబంధనలకు విరుద్ధంగా అదనపు నిర్మాణాలు చేపట్టొద్దు
హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్ హెచ్చరిక
కాకతీయ, హన్మకొండ : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అదనపు నిర్మాణాలను వెంటనే తొలగించాలని హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్ హెచ్చరించారు. లబ్ధిదారులు స్వచ్ఛందంగా తొలగించకపోతే అధికారులే జేసీబీలతో కూల్చివేస్తారని స్పష్టం చేశారు. న్యూశాయంపేటలో ప్రభుత్వం నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేసిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయంలోని పలు బ్లాకుల వద్ద అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు. కొందరు గ్రౌండ్ ఫ్లోర్ లబ్ధిదారులు అదనపు పిల్లర్లు వేయడంతోపాటు పక్కన బాత్రూంలు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని, పార్కులు, ఇతర అవసరాలకు కేటాయించిన ఖాళీ స్థలాలను ఆక్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదులపై ఇద్దరు ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లతో పరిశీలన చేయించగా పలు బ్లాకుల వద్ద అదనపు నిర్మాణాలు గుర్తించినట్లు పీడీ చెప్పారు. సంబంధిత ఏఈలు నోటీసులు జారీ చేసి గడువు ఇస్తారని, ఆలోగా లబ్ధిదారులే నిర్మాణాలను తొలగించాలని సూచించారు. గడువు ముగిసినా తొలగించకపోతే యంత్రాలతో కూల్చివేత చేపడతామని హెచ్చరించారు. ఇళ్ల లోపల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మరమ్మతులు, మార్పులు చేసుకోవచ్చని, అయితే బయట ఖాళీ స్థలాలు, ఉమ్మడి ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. వందలాది కుటుంబాలు ఒకే ప్రాంగణంలో నివసిస్తున్నందున పార్కులు, ఉమ్మడి స్థలాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోవద్దని, నిబంధనలు పాటించాలని సిద్ధార్థ నాయక్ కోరారు.

