మంత్రి కార్యక్రమంలో విద్యుత్ శాఖ వైఫల్యం
ఏఈపై క్రమశిక్షణ చర్యలకు కలెక్టర్ సిఫార్సు
ముందస్తు ఆదేశాలున్నా నిలిచిన విద్యుత్ సరఫరా
టీజీఎన్పీడీసీఎల్ సీఎండీకి లేఖ
కాకతీయ, ములుగు : మంత్రి సీతక్క పాల్గొన్న నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ములుగు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఆపరేషనల్) బానోతు రవిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీకి లేఖ రాశారు. సోమవారం ములుగు మండలం ఇంచర్లలోని ఎంఆర్ గార్డెన్స్‌లో మంత్రి దనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా ములుగు, వెంకటాపూర్ మండలాల లబ్ధిదారులకు నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ములుగు ఎంపీడీవో ముందుగానే ఆదేశాలు జారీ చేసినప్పటికీ విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో అధికారిక కార్యక్రమానికి ఆటంకం కలగడంతో పాటు మంత్రి, ప్రజల సమక్షంలో జిల్లా యంత్రాంగానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. కార్యక్రమానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడం, ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచడంలో ఏఈ బానోతు రవి విఫలమైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆయనపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

