ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం
పరిశుభ్రతతోనే సగం రోగాలకు దూరం.. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
కాకతీయ,శంకరపట్నం:ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రతతో పాటు రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రతను గుర్తించిన ఆయన సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు వైద్యం అందించే ఆసుపత్రిలోనే పరిశుభ్రత లోపించడం ఏమిటని ప్రశ్నించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని, ఆసుపత్రి భవనంతో పాటు పరిసరాలను కూడా నిత్యం శుభ్రంగా ఉంచాలని సూచించారు.
అనంతరం వైద్యులు, సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, సమయపాలన, రోజువారీగా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య, వారి ఆరోగ్య సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది విధులకు నిర్ణీత సమయానికి హాజరుకావాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ తనిఖీలో పీసీసీ సభ్యుడు, మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి తిరుపతి, ఏఎంసీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

