హైలెవల్ బ్రిడ్జి కోసం వాగులో దిగి వినూత్న నిరసన!
నాలుగు గంటల పాటు గ్రామస్థులతో కలిసి నీటిలో ఆందోళన
మార్చిలోపు అనుమతులు.. పనులు ప్రారంభిస్తాం: ఎస్సీ భీమ్లానాయక్
కాకతీయ,శంకరపట్నం:అర్కండ్ల వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామస్థులతో కలిసి వాగులోకి దిగి సుమారు నాలుగు గంటల పాటు నీటిలోనే ఆందోళన నిర్వహించారు. బ్రిడ్జి నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన విరమించేది లేదని ఆయన పట్టుబట్టారు. ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. అర్కండ్ల వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చిన పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన ఏడాదిలోపు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వాగు దాటేందుకు గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరసన నేపథ్యంలో తహసీల్దార్ సురేఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం ఎస్సీ భీమ్లానాయక్ విశారదన్ మహారాజ్తో ఫోన్లో మాట్లాడి మార్చి నెలలోపు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయించి, నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో అధికారుల హామీకి అంగీకరించిన విశారదన్ మహారాజ్ గ్రామస్థులతో కలిసి నాలుగు గంటల పాటు కొనసాగించిన నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నేదునూరి పవన్, మాజీ ఉపసర్పంచ్ చెర్ల శ్రీనివాస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మండల అధ్యక్షుడు యమునూరి ప్రశాంత్, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఎండీ సల్మా తదితరులతో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

