epaper
Saturday, November 21, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గులాబీ గూటిలో గౌరు చేరిక చిచ్చు!

గులాబీ గూటిలో గౌరు చేరిక చిచ్చు!
గ్రేటర్‌ వరంగల్‌ రాజకీయాల్లో కొత్త అసమ్మతి పర్వం
విద్యావేత్త గౌరు తిరుపతిరెడ్డి చేరికపై సీనియర్లలో అసంతృప్తి
ఇద్దరు నగర మాజీ ఎమ్మెల్యేల స‌మ్మ‌తి లేకుండానే చేరిక‌కు స‌న్న‌ద్ధం
అస‌హ‌నంలో మాజీ ఎమ్మెల్యేలు వినయభాస్కర్‌, నన్నపనేని నరేందర్‌
ఎర్రబెల్లి, చల్లా, ఆరూరి ప్రోత్సాహంతో చేరికకు రంగం సిద్ధం
త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధి వ్య‌వ‌హారంలో జోక్యంపై ఇద్ద‌రు నేత‌ల్లో ఆగ్ర‌హం
మేయర్‌ అభ్యర్థిగా తెరపైకి గౌరు పేరు.. పార్టీలో సీనియ‌ర్ నేత‌లు గుస్సా
ఉద్యమకాలం నుంచి పనిచేసిన నేతలకు ప్రాధాన్యం తగ్గుతోందన్న ఆవేదన
పైకి స్వాగతం.. లోలోపల సహాయ నిరాకరణకు అవకాశమా?

     కిర‌ణ్ గౌడ్ అరెల్లి,       కాక‌తీయ‌ ఎడిట‌ర్ 

గ్రేటర్‌ వరంగల్‌ రాజకీయాల్లో బీఆర్ఎస్‌ పార్టీకి కొత్త చేరికలు బలాన్నిస్తాయనుకుంటే.. అవే ఇప్పుడు పార్టీలో కొత్త రాజకీయ సమీకరణాలకు, అంతర్గత అసమ్మతికి ఆజ్యం పోస్తున్నాయన్న చర్చ మొదలైంది. ప్రముఖ విద్యావేత్త, ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్‌ గౌరు తిరుపతిరెడ్డి బీఆర్ఎస్‌లో చేరనున్నారన్న ప్రచారం ఆ పార్టీ నగర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు ఆయన చేరికను స్వాగతిస్తూ కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు నగర రాజకీయాల్లో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్‌ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పరిణామంపై అసంతృప్తితో ఉన్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల రాజకీయాల్లో కీలకంగా ఉన్న నాయకులతో సంప్రదింపులు లేకుండానే ఈ చేరిక వ్యవహారం ముందుకు వెళ్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ గౌరు తిరుపతిరెడ్డి చేరికను ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం ఉంది. మరోవైపు మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ వర్గాల్లో ఈ పరిణామంపై అసంతృప్తి వ్యక్తమవుతోంద‌ని విశ్వ‌స‌నీయం తెలిసింది. గౌరు తిరుపతిరెడ్డి చేరికతో పాటు ఆయనకు భవిష్యత్తులో కీలక పదవి, ముఖ్యంగా గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ అభ్యర్థిత్వం కట్టబెట్టే అవకాశాలపై చర్చ జరుగుతుండటమే ఈ అసమ్మతికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. చేరిక ఒక్కటే కాకుండా, దాని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నగరంలో పార్టీ నాయకత్వంపై చూపే ప్రభావం, ఇప్పటికే పనిచేస్తున్న నేతల భవిష్యత్తు వంటి అంశాలు ఇప్పుడు గులాబీ శిబిరంలో చర్చకు వస్తున్నాయి.

చేరిక వెనుక ముగ్గురు నేతల వ్యూహం!

గౌరు తిరుపతిరెడ్డిని బీఆర్ఎస్‌లోకి తీసుకురావడంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. వరంగల్‌ నగర రాజకీయాలకు వెలుపల ఉన్న నియోజకవర్గాలకు చెందిన ఈ నేతలు గౌరు తిరుపతిరెడ్డి చేరికకు చొరవ చూపుతున్నారన్న సమాచారం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. నగరంలో పార్టీని బలోపేతం చేయాలంటే స్థానికంగా ఏళ్లుగా పనిచేస్తున్న నాయకులతో సంప్రదింపులు జరపడం, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరమని కొందరు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చేరిక వ్యవహారం ముందుకు సాగుతున్న తీరులో నగర నాయకత్వానికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో పార్టీకి నాయకత్వం వహించిన మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమన్వయం లేకుండా ఇతర ప్రాంతాల నేతలు నగర రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారన్న భావన కొందరిలో బలపడుతోంది. ఒక నాయకుడిని పార్టీలో చేర్చుకోవడం అధిష్ఠానం నిర్ణయమే అయినప్పటికీ, ఆ చేరిక వల్ల స్థానిక నాయకత్వంపై పడే ప్రభావాన్ని కూడా అంచనా వేయాల్సి ఉంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పార్టీకి బలమైన కేడర్‌ ఉన్న ప్రాంతాల్లో కొత్త నాయకుడి ప్రవేశం సమన్వయంతో జరగకపోతే అంతర్గత విభేదాలు పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. గౌరు తిరుపతిరెడ్డి చేరికకు మద్దతు ఇస్తున్న నేతలు పార్టీ విస్తరణ కోణంలో ఆలోచిస్తుండగా, స్థానిక నేతలు మాత్రం తమ రాజకీయ ప్రాధాన్యానికి గండిపడుతుందన్న ఆందోళనతో ఉన్నారన్నది ప్రస్తుత చర్చ సారాంశం.

మేయర్‌ అభ్యర్థిత్వ ప్రచారమే అసలు మంట!

గౌరు తిరుపతిరెడ్డి చేరికపై అభ్యంతరాల కంటే, ఆయనకు గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ అభ్యర్థిత్వం కట్టబెట్టే అవకాశాలపై జరుగుతున్న ప్రచారమే పార్టీలో అసమ్మతికి ప్రధాన కారణంగా మారుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నగర రాజకీయాల్లో పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన నాయకులు చాలామంది ఉన్నారు. ఉద్యమకాలం నుంచి పార్టీతో కొనసాగుతూ, ఎన్నికల్లో బాధ్యతలు నిర్వహిస్తూ, కష్టకాలంలోనూ కేడర్‌ను నిలబెట్టిన నేతలు మేయర్‌ పదవిపై ఆశలు పెట్టుకోవడం సహజం. అలాంటి వారిని పక్కనపెట్టి, కొత్తగా పార్టీలోకి వచ్చే విద్యాసంస్థల అధినేతకు మేయర్‌ అభ్యర్థిత్వం ఖరారవుతుందన్న ప్రచారం వారిలో అసంతృప్తిని పెంచుతోందని సమాచారం. గౌరు తిరుపతిరెడ్డి విద్యారంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి కావడం, ఆయనకు ఆర్థికంగా, సామాజికంగా పలుకుబడి ఉండటం ఒక అంశమైతే.. పార్టీ రాజకీయాల్లో ఆయన అనుభవం, కేడర్‌తో అనుబంధం, స్థానికంగా ఎన్నికల సమయంలో నిర్వహించగల పాత్ర మరో అంశమని సీనియర్లు భావిస్తున్నారు. కేవలం ఆర్థిక బలం, వ్యక్తిగత పరిచయాల ఆధారంగా మేయర్‌ అభ్యర్థిత్వంపై ముందుగానే ప్రచారం జరగడం పార్టీ కోసం పనిచేసిన నాయకులకు తప్పుడు సంకేతాలు పంపుతుందన్న‌ చర్చ ఉంది. మేయర్‌ అభ్యర్థి ఎంపిక అనేది పార్టీ బలం, సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకత్వం, ప్రజాదరణ, కేడర్‌ ఆమోదం వంటి అంశాల ఆధారంగా జరగాల్సి ఉంటుంది. అయితే చేరికకు ముందే ఒకరి పేరును మేయర్‌ అభ్యర్థిగా ప్రచారం చేయడం వల్ల మిగిలిన ఆశావహుల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రచారంపై పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ మేయర్‌ అభ్యర్థిత్వ చర్చే చేరిక వ్యవహారాన్ని సాధారణ రాజకీయ పరిణామం నుంచి అంతర్గత ఆధిపత్య పోరుకు దారితీసే అంశంగా మార్చుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నగర మాజీ ఎమ్మెల్యేల అసంతృప్తి.. సమన్వయానికి సవాల్‌!

మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ ఈ చేరిక వ్యవహారంపై అసహనంతో ఉన్నారన్న ప్రచారం బీఆర్ఎస్‌ నగర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరూ వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో పార్టీ రాజకీయాలకు సంబంధించి కీలకంగా వ్యవహరించిన నాయకులు. నగరంలో పార్టీ బలోపేతం, కేడర్‌ సమన్వయం, స్థానిక రాజకీయ పరిణామాల్లో వీరి పాత్రను విస్మరించలేమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలాంటి నాయకులతో ముందస్తు చర్చలు లేకుండా గౌరు తిరుపతిరెడ్డి చేరికను ప్రోత్సహించడం, ఆయనకు మేయర్‌ అభ్యర్థిత్వంపై ప్రచారం జరగడం తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వనట్లేనని కొందరు నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల హనుమకొండలోని బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గౌరు తిరుపతిరెడ్డి చేరికను స్వాగతిస్తూ ఒక నగర ఎమ్మెల్యే మాట్లాడిన అనంతరం, మరో నగర ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోనూ త్వరలో భారీగా చేరికలు ఉంటాయని వ్యాఖ్యానించ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌ను వ్య‌క్తం చేస్తోంది. ఈ వ్యాఖ్యలను కొందరు సాధారణ రాజకీయ ప్రకటనగా చూస్తుండగా, మరికొందరు మాత్రం ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోవడంపై పరోక్ష అసంతృప్తి వ్యక్తీకరణగా విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నాయకత్వ బాధ్యతలు, చేరికలపై నిర్ణయాలు, కేడర్‌ సమీకరణల్లో సమన్వయం లేకపోతే నేతల మధ్య విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక నియోజకవర్గంలో చేరికలకు మరొక నియోజకవర్గానికి చెందిన నేతలు చొరవ చూపడం, స్థానిక నాయకత్వాన్ని సంప్రదించకపోవడం వంటి పరిణామాలు ఆధిపత్య పోరుకు దారితీయవచ్చని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. పైకి స్వాగతాలు, ఆత్మీయ పలకరింపులు కనిపించినా.. అంతర్గతంగా మాత్రం అసంతృప్తి పెరుగుతోందన్న ప్రచారం ఈ నేపథ్యంలో బలపడుతోంది.

పైకి ఐక్యత.. లోలోపల సహాయ నిరాకరణ భయం!

గౌరు తిరుపతిరెడ్డి చేరికతో బీఆర్ఎస్‌కు కొత్త వర్గాలు, ఆర్థిక వనరులు, విద్యారంగంతో సంబంధం ఉన్న పరిచయాలు అందుబాటులోకి వస్తాయని చేరికను ప్రోత్సహిస్తున్న నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త నాయకుడి రాకతో పాత నాయకులను పక్కనపెడుతున్నారన్న భావన కేడర్‌లో ఏర్పడితే ఆశించిన ప్రయోజనానికి బదులుగా నష్టం జరిగే ప్రమాదం ఉందని మరో వర్గం హెచ్చరిస్తున్నట్లు సమాచారం. బహిరంగంగా ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయకపోయినా, కార్యక్రమాలకు దూరంగా ఉండటం, చేరికల ప్రచారంలో చురుకుగా పాల్గొనకపోవడం, స్థానికంగా కేడర్‌ను సమీకరించడంలో ఆసక్తి చూపకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే అది పార్టీ పనితీరుపై ప్రభావం చూపవచ్చన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని భావిస్తున్న సమయంలో నాయకుల మధ్య సమన్వయ లోపం గెలుపు అవకాశాలను దెబ్బతీయవచ్చని కొందరు సీనియర్లు హెచ్చరిస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి ప్రాధాన్యం ఇవ్వడం తప్పు కాకపోయినా, ఇప్పటికే పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించకూడదన్నది వారి వాదన. ఒకవైపు కొత్త చేరికలతో పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తూనే, మరోవైపు పాత నాయకుల గౌరవం, రాజకీయ ప్రాధాన్యం, స్థానిక ఆధిపత్యాన్ని కాపాడేలా సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. లేకపోతే అసంతృప్తితో ఉన్న నాయకులు మౌనంగా ఉండి, కీలక సమయంలో సహకారం తగ్గించే పరిస్థితి ఏర్పడవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నిరుద్యోగుల కన్నీళ్లు తెలిసిన వాడిని!

నిరుద్యోగుల కన్నీళ్లు తెలిసిన వాడిని! పారాచూట్ లీడర్‌ను కాదు..ఆద‌రించండి 13 ఏళ్లుగా నిరుద్యోగుల మధ్యే...

హుజురాబాద్‌లోనూ బైపోల్‌..?!

హుజురాబాద్‌లోనూ బైపోల్‌..?! మరో బైపోల్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి హింట్‌ ఖైరతాబాద్‌తో పాటే ఉంటుంద‌ని...

దానం దారెటు..?

దానం దారెటు..? సుప్రీం తలుపు త‌ట్టిన దానం నాగేంద‌ర్‌ కేవియట్ పిటిష‌న్లు దాఖ‌లు చేసిన‌...

వనమా ఇంట్లో వారసత్వ వార్‌!

వనమా ఇంట్లో వారసత్వ వార్‌! కూతురి కోసం రాఘవ పట్టు.. మనవడి కోసం...

మా వాటా మాకివ్వండి

మా వాటా మాకివ్వండి రాజ్యాధికారం సాధ‌నే బీసీల అభివృద్ధికి మార్గం జ‌న‌ర‌ల్ సీటు అంటే...

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది బిజినెస్‌మెన్ కావాల‌నేది నా చిన్న‌ప్ప‌టి క‌ల‌ అన్న...

పది పార్టీలు మారిన చరిత్ర నీది

పది పార్టీలు మారిన చరిత్ర నీది నువ్వా కాంగ్రెస్‌ను విమర్శించేది? సీఎం రేవంత్‌ను తిడుతుంటే...

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌

ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్‌ మంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన మహిళా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.