సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి
పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపులపై స్పష్టత ఇవ్వాలి
పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం
ఖమ్మం ఐడీఓసీలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల భారీ నిరసన
టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఐక్యంగా ఆందోళన
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) ఆవరణ గురువారం ఉద్యోగుల ఆవేదనకు వేదికగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సంయుక్త వేదిక టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో చేపట్టిన ఈ ఆందోళనకు జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై ఐక్యతను చాటారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసిన నేపథ్యంలో, తమ గోడును మరోసారి తెలియజేయడానికే ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు వెల్లడించారు. ఖమ్మం మాత్రమే కాకుండా ఆర్డీఓ కార్యాలయాలు, మండల కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగడం గమనార్హం.

పెండింగ్ సమస్యలపై ఉద్యోగుల ఆవేదన
ఈ సందర్భంగా టీజీఈజేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొంగర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని సుమారు 15.25 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పరిపాలన సమర్థవంతంగా సాగాలంటే ఉద్యోగుల సంక్షేమం కీలకమని, ఉద్యోగులే ప్రభుత్వ అభివృద్ధికి ప్రధాన భాగస్వాములని గుర్తు చేశారు. నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రధాన డిమాండ్లు ఇవే
ఈ నిరసన సందర్భంగా ఉద్యోగులు పలు కీలక డిమాండ్లను ఉంచారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని, డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్యం అందేలా ఈహెచ్ఎస్, ఆరోగ్య కార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిరసన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీజకు టీజీఈజేఏసీ నాయకులు అందజేశారు. ఖమ్మంలో జరిగిన ఈ భారీ నిరసన కార్యక్రమానికి వచ్చిన స్పందన రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి సందేశమని నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు భారీ సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

