ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం
టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు సమర్పణ
కాకతీయ, శంకరపట్నం : ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కే. సురేఖకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30 నెలలు పూర్తయినప్పటికీ అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్‌తో రెండవ పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భారీగా పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయని, సుమారు రూ.13 వేల కోట్ల బకాయిలను ఒకేసారి విడుదల చేసి ఉద్యోగులు, పెన్షన్ కుటుంబాలకు ఉపశమనం కల్పించాలని కోరారు. ప్రతి నెల పదవీ విరమణలు పెరుగుతుండడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని తెలిపారు. ఆరోగ్య కార్డుల అమలులో ఆలస్యం జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేముల లక్ష్మీనారాయణ, మహిపాల్ రెడ్డి, నాగేశ్వర్ రావు, వెంకట్రామ్ రెడ్డి, సతీష్, ఠాకూర్, శ్రీనివాసరావు దేశ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు.

