ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి
కార్మికుల ఐక్యతతో పోరాటం విజయవంతం చేయాలని పిలుపు
విద్యుత్ బస్సుల విధానంపై ఆందోళన వ్యక్తం
కాకతీయ, ఖమ్మం : ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లను వెంటనే పరిష్కరించి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని మంచికంటి భవనంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆధ్వర్యంలో గుండు మాధవరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికులపై పనిభారం పెంచుతూ, ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో సంస్థను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటంలో కార్మికులంతా విశాల ఐక్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ల అమలు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని, 2017 వేతన ఎరియర్స్, 2021 మరియు 2025 వేతన సవరణల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు.
సీఐటీయూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మా విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఆర్టీసీ రక్షణ, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న సమ్మెకు సీఐటీయూ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు సమ్మెకు సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని, సమ్మెను విచ్ఛిన్నం చేసే చర్యలను విరమించాలని వక్తలు డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రతను కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు షేక్ బషీరుద్దీన్, ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ నవీన్ రెడ్డి, భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మెరుగు వెంకటరమణ, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఖమ్మం డిపో కార్యదర్శి బేతంపూడి బుచ్చిబాబు, ఎస్ డబ్ల్యూ ఎఫ్ రీజియన్ కోశాధికారి పగిళ్ళపల్లి నరసింహారావు, డిపో కార్యదర్శి గుగ్గిళ్ళ రోశయ్య, డిపో కమిటీ నాయకులు బుగ్గవీటి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

