మాదిగ జనాభాకు తగిన ప్రాతినిధ్యం కావాలి
జనాభాకు తగినట్లుగా 11 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
నియామకాలు, నామినేటెడ్ పదవులు, జిల్లా పరిషత్‌లో వాటా కల్పించాలి
ఖమ్మం జిల్లాలో మాదిగలకు అన్యాయం
మాదిగల ఆత్మగౌరవానికి మధిర ప్రతీక
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ పిడమర్తి రవి
కాకతీయ, ఖమ్మం : మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ ప్రకారం అన్ని పదవులు కేటాయించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. కులగణన లెక్కల ప్రకారం మాదిగలు రాష్ట్రంలో అతిపెద్ద వర్గమని, వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఖమ్మంలోని ప్రెస్ క్లబ్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా దాదాపు 37 లక్షలు ఉందని చెప్పారు. అయితే ఆ జనాభాకు తగిన ప్రాతినిధ్యం రాజకీయంగా కల్పించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలు ఐదు మంది మాత్రమే ఉన్నారని, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేరని, నామినేటెడ్ పోస్టుల్లో ఒకే ఒక మాదిగ ఉన్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పే లెక్కలకు, ఇచ్చే అవకాశాలకు పొంతన లేదన్నారు. ఇకపై ప్రభుత్వం ఇచ్చే అన్ని నియామకాలలో మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న నామినేటెడ్ పోస్టులు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా మాదిగలకు అదే శాతం కేటాయించాలని కోరారు.
మధిర మాదిగల ఆత్మగౌరవం
టిపిసిసి మాజీ కార్యదర్శి వక్కలగడ్డ చంద్రశేఖర్ మాట్లాడుతూ మధిర నియోజకవర్గం మాదిగల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన నిర్వహించి వివరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మాదిగల సంఖ్య 37 లక్షలకు పైగా ఉందని, ఖమ్మం జిల్లాలో 2 లక్షలకు పైగా ఉన్నారని చెప్పారు. జిల్లాలోని రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో మాల వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని, మాదిగలకు ప్రాతినిధ్యం లేకపోవడం అన్యాయమని అన్నారు. జిల్లాలో ఎస్సీలలో మూడింట రెండువంతులు మాదిగలే ఉన్నప్పటికీ కనీసం ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్ర కాలంలో మధిరలో 60 వేల వరకు మాదిగలు ఉన్నప్పటికీ వారికి రాజకీయ ప్రాతినిధ్యం దక్కలేదని పేర్కొన్నారు. ఈ అంశంపై పార్టీ నాయకత్వం వద్దకు వెళ్లి వాస్తవాలు తెలియజేస్తామని తెలిపారు. మధిరను ఈసారి సాధించి తీరుతామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని రెండు ఎస్సీ సీట్లను మాదిగలకు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తామని అన్నారు. జిల్లాలో మాదిగలు ఎప్పుడూ కాంగ్రెస్‌కు అండగా నిలిచారని, అయినప్పటికీ ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేషన్ చైర్మన్ పదవులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవుల్లో ఖమ్మం జిల్లా మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో బీసీ వర్గాలు 50 శాతం పైగా ఉన్నాయని, వారికి కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు ఒక ఎమ్మెల్యే సీటు, ఖమ్మం లోక్‌సభ సీటు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ బొబ్బిలి భరత్ చంద్ర, కూసుమంచి మాజీ ఎంపీపీ ఎడవల్లి ముత్తయ్య, కనకం మైసయ్య, కోటవుర్తి భాస్కర్, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు తొల రాకేష్, జిల్లా విజయకుమార్, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

