మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి చేయాలి
ఎస్టీపీ, యూజీడీ, రోప్‌వే పనులు వర్షాకాలానికి ముందే ముగించాలి
సింథటిక్ రన్నింగ్ ట్రాక్‌ను విద్యార్థుల పోటీలతో ఘనంగా ప్రారంభించాలి
92 కోట్లతో 20 ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేపట్టండి
అభివృద్ధి పనుల ఫలితాలు ప్రజలకు చూపాలి
పంటల కొనుగోళ్లలో గన్నీ బ్యాగుల కొరత రాకుండా చూడాలి
మార్కెట్ యార్డులో సోలార్ పవర్ వినియోగంపై నివేదిక ఇవ్వాలి
ధాన్యపు నిల్వ సమస్యలు తలెత్తకుండా అధికారుల అప్రమత్తత అవసరం
రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
కాకతీయ,ఖమ్మం: జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి వాటి ఫలితాలను ప్రజలకు చూపాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌర సరఫరాలు, పంటల కొనుగోలు, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం మరియు నగర పాలక సంస్థ పరిధిలోని అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు మంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ పంటల కొనుగోళ్లు మరియు నగర అభివృద్ధి పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ మొదటి వారానికి బైపాస్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు మున్నేరు రిటైనింగ్ వాల్ ఎడమ, కుడి వైపుల పనులు పూర్తవ్వాలని, ఎక్కడా చిన్న గ్యాప్ కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి వర్షాకాలం నాటికి సిద్ధం చేయాలన్నారు.
92 కోట్లతో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్
ఖమ్మం నగరాన్ని క్రీడల పరంగా తీర్చిదిద్దేందుకు ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం, క్రీడాకారుల వసతి గృహాలు వంటి సదుపాయాలతో 20 ఎకరాల్లో 92 కోట్ల అంచనా వ్యయంతో స్పోర్ట్స్ హబ్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. కనీసం 50 శాతం కేంద్ర నిధులు సమీకరించేలా చర్యలు తీసుకోవాలని, 200 మంది క్రీడాకారులకు వసతి కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఇప్పటికే సిద్ధమైన సింథటిక్ రన్నింగ్ ట్రాక్ నిర్వహణ బాధ్యతలు చూస్తూ, త్వరలోనే విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి ఘనంగా ప్రారంభోత్సవం చేయాలని దిశానిర్దేశం చేశారు.
వర్షాకాలానికి ముందే మౌలిక సదుపాయాల పనులు
నగరంలోని ధంసలాపురం ఎస్టీపీ స్థలాన్ని మూడు రోజుల్లో అప్పగించి పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్ పెండింగ్ పనులతో పాటు ఖమ్మం ఖిల్లా రోప్‌వే నిర్మాణ బేస్‌మెంట్ పనులను ఈ నెలలోనే పూర్తి చేయాలన్నారు. వర్షాలు మొదలైతే పనులకు ఆటంకం కలిగే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని సూచించారు. మార్కెట్ యార్డులో సోలార్ పవర్ వినియోగంపై ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని, వరదల సమయంలో మార్కెట్‌లో నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ముమ్మరంగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు
పంటల కొనుగోళ్లపై మంత్రి మాట్లాడుతూ ఏ కేంద్రంలోనూ గన్నీ బ్యాగుల కొరత రాకూడదని స్పష్టం చేశారు. డిమాండ్ మేరకు అదనపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, జీపీఎస్ ట్రాకింగ్ ఉన్న వాహనాలనే ధాన్యం తరలింపునకు వినియోగించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలో 2.17 లక్షల టన్నుల మొక్కజొన్న, 2,37,500 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇప్పటికే 240 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, 45 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

