తుమ్మల అనుభవం ముందు అజయ్ ఎంత?
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు పువ్వాడ వ్యాఖ్యలు
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పాలన
మొక్కజొన్న కేంద్రాలపై ప్రతిపక్షాల ఆరోపణలు ఉనికి కోసమే
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్
కాకతీయ, ఖమ్మం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పువ్వాడ అజయ్ తీరుపై నిప్పులు చెరిగారు. అక్రమ కేసులు, కబ్జాలు, అవినీతికి మారుపేరుగా నిలిచిన అజయ్ కుమార్.. మచ్చలేని నాయకుడు తుమ్మలపై విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. అటువంటి గడ్డు పరిస్థితుల్లోనూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు సమన్వయంతో అభివృద్ధిని కాంక్షిస్తుంటే, ఓటమి భారంతో ఉన్న ప్రతిపక్ష నేతలు అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మొక్కజొన్న కొనుగోలుపై రాజకీయం వద్దు
జిల్లాలో మొక్కజొన్న దిగుబడి అధికంగా ఉన్న నేపథ్యంలో, అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సత్యనారాయణ గౌడ్ స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీలు, ఆత్మ కమిటీల ద్వారా సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. కేవలం తమ రాజకీయ మనుగడ కోసమే ప్రతిపక్షాలు అమాయక రైతులను ఉసిగొల్పుతున్నాయని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.
ఎన్నికలకు సన్నద్ధం కావాలి
రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. బ్లాక్, మండల, పట్టణ కమిటీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు స్థానిక శాసనసభ్యుల సలహాలు, సూచనలతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి, అన్ని వర్గాలను కలుపుకుంటూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని సూచించారు. గత ఎన్నికల్లో పువ్వాడకు బుద్ధి చెప్పిన ఖమ్మం ప్రజలు, రాబోయే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

