దేశ విముక్తికి మార్క్సిజం–లెనినిజమే మార్గం
న్యూడెమోక్రసీ నాయకుడు భూక్య శివ నాయక్
పాత చన్నెగలగడ్డలో ఘనంగా సీపీఐ(ఎంఎల్) ఆవిర్భావ దినోత్సవం
కాకతీయ, కారేపల్లి: మార్క్సిస్టు మహోపాధ్యాయుడు వ్లాదిమిర్ లెనిన్ జయంతిని పురస్కరించుకుని సిపిఐ(ఎంఎల్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పాత చన్నెగలగడ్డ గ్రామంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు భూక్య శివ నాయక్.. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. భూమి, భుక్తి, దేశ విముక్తి లక్ష్యాలతో 1969లో ఆవిర్భవించిన ఈ పార్టీ, నాటి నుంచి నేటి వరకు పేదల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేసిందని కొనియాడారు. శివ నాయక్ మాట్లాడుతూ.. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో లక్షలాది ఎకరాల భూములను పేదలకు, గిరిజనులకు పంచిపెట్టిన ఘన చరిత్ర తమ పార్టీకి ఉందన్నారు. గ్రామాల్లో మౌలిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమిస్తున్నామని తెలిపారు. దేశ సంపదను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తోందని శివ నాయక్ విమర్శించారు. సామ్రాజ్యవాద శక్తుల ప్రభావంతో సామాన్యుల బతుకులు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల హామీలు అమలు కావడం లేదని ఆరోపించారు. భూముల కబ్జాలు, అవినీతి యధేచ్ఛగా సాగుతున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్మికులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

