డీజీపీగా సీవీ ఆనంద్!
పోలీస్ బాస్ నియామకం పూర్తి !
నేడో రేపో అధికారిక ఉత్తర్వులు!
మే మొదటి వారంలో బాధ్యతలు !
ఈనెల 30న శివధర్‌రెడ్డి పదవీ విరమణ
ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్
ఆ స్థానంలో శిఖా గోయల్‌ను నియమించిన ప్రభుత్వం
దీంతో డీజీపీగా ఆనంద్‌కు లైన్ క్లియర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కొత్త డీజీపీగా 1991వ బ్యాచ్ అధికారి సీవీ ఆనంద్ పేరు దాదాపు ఖరారైంది. నేడోరేపో రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా వెల్లడించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే రెండుసార్లు ఆయనను ఊరించి నిరుత్సాహ పరిచిన డీజీపీ పదవి.. త్వరలోనే వరించనుంది. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ బీ శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణ చేస్తుండగా.. ఆయన స్థానంలో పూర్తిస్థాయి డీజీపీగా సీవీ ఆనంద్ పేరు ప్రకటించనున్నట్టు సమాచారం. సీవీ ఆనంద్ మే మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆనంద్ ఉండగా… తాజాగా జరిగిన బదిలీల్లో ఆయన స్థానంలో షికా గోయల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఆనంద్ చూపిన చొరవ, అనుభవం ప్లస్ పాయింట్లుగా మారనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పలు సంస్కరణలను అమలు చేయడంలోనూ ఆయన సమర్థతపై ముఖ్యమంత్రికి నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎస్ అధికారుల భారీ బదిలీల ప్రక్రియ కూడా పూర్తవడంతో ఇక డీజీపీ నియామకానికి లైన్ క్లియర్ అయింది.
నేడోరేపో ఉత్తర్వులు!
డీజీపీగా తన ఉద్యోగకాలం పొడిగిస్తారని ఆశలు పెట్టుకున్న బీ శివధర్‌రెడ్డి పేరు యూపీఎస్సీ సూచించిన జాబితాలో లేకపోవడంతో ఆయన ఉద్యోగ విరమణ అనివార్యమైంది. దీంతో తెలంగాణకు పూర్తిస్థాయి డీజీపీగా సీవీ ఆనంద్ పేరు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ప్రకాశ్‌సింగ్ బాదల్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ధన్‌గోపాల్ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు శాశ్వతప్రాతిపదికన సీవీ ఆనంద్ పేరు ప్రకటిస్తారని సమాచారం. ఈనేపథ్యంలో తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు యువ ఐపీఎస్‌లతో పాటు, సీనియర్లకు కూడా స్థానచలనం కలిగింది. అయితే, సీవీ ఆనంద్ రెండేండ్ల డీజీపీ ఉద్యోగ కాలం ముగిసే నాటికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై ఎన్నికల కమిషన్ వేటువేసిన సంగతి తెలిసిందే.

