కాంగ్రెస్ తెచ్చిన కరువు!
దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు?
తమ్మిడిహట్టి నీటి లభ్యతపై కేంద్రం మూడు లేఖలు ఇచ్చింది
మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా మూడేళ్లుగా కాలయాపన
ఎన్ని నీళ్లు ఎత్తారో శ్వేతపత్రం విడుదల చేయాలి
గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తారా? ఉత్తమ్‌కు హరీశ్‌రావు సవాల్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటిని ఎత్తుతుంటే తెలంగాణలో దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల నుంచి నీటిని ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నించారు. ఏ ప్రాజెక్టులో ఎన్ని మోటార్లు నడిపారు, ఎన్ని గంటలు పంపింగ్ చేశారు, ఎంత నీటిని ఎత్తిపోశారో పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి వెంటనే మరమ్మతులు చేసి కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తాలని కోరారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నీటిని ఎత్తారో ప్రభుత్వం వెల్లడించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టులోనూ ఐదు మోటార్లలో రెండు మాత్రమే నడుస్తున్నాయని, 12 గంటలు నడిపి 12 గంటలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలంలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకు ఎత్తడం లేదని ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నడిపి ఉంటే వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్‌లోని కొంత ప్రాంతం సస్యశ్యామలంగా మారేదన్నారు. పక్క రాష్ట్రంలో పంటలకు సెలవు ప్రకటించని పరిస్థితుల్లో తెలంగాణలో క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.
మేడిగడ్డ మరమ్మతులు వెంటనే చేపట్టాలి
కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను నడిపి నీటిని ఎత్తాలని విశ్రాంత ఇంజినీర్లు సూచించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. రాజకీయ కారణాలతో మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచారని ఆరోపించారు. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నీటిని ఎత్తాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని చెప్పిందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు బాగున్నాయని కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అని, దాని ద్వారా కరువును ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు.
మహారాష్ట్రతో చర్చల్లో బీఆర్ఎస్ చొరవ
తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్లకు అంగీకరించాలని కోరుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు మహారాష్ట్రతో చర్చలు జరిపిందని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు 2014 జూలై 23న మహారాష్ట్రకు వెళ్లామని, ఆ తర్వాత 2014 ఆగస్టు 16, డిసెంబర్ 23, 2015 ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 17 తేదీల్లోనూ చర్చలు జరిపినట్లు వివరించారు. అప్పటి కాంగ్రెస్ మంత్రి హసన్ ముష్రఫ్తో పాటు మహారాష్ట్ర ప్రతినిధులను కలిసి తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు అంగీకరించాలని కోరామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం చర్చలు ప్రారంభించడానికే 1,054 రోజులు తీసుకుందని విమర్శించారు. గతంలో తాము అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే పలుమార్లు చర్చలు జరిపామని పేర్కొన్నారు.
తమ్మిడిహట్టి నీటి లభ్యతపై కేంద్రం లేఖలు
తమ్మిడిహట్టి వద్ద తెలంగాణకు అవసరమైన స్థాయిలో నీరు అందుబాటులో లేదని కేంద్ర జల సంఘం మూడు లేఖల్లో పేర్కొందని హరీశ్‌రావు తెలిపారు. 2015 ఫిబ్రవరి 18న 160 టీఎంసీల నీరు అందుబాటులో లేదని, మార్చి 4న ఎగువ రాష్ట్రాల వాటాలు, నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని ఎంత నీటిని మళ్లించవచ్చో పరిశీలించాలని సూచించినట్లు వివరించారు. 2015 మార్చి 13న అప్పటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి కూడా ప్రత్యామ్నాయాన్ని పరిశీలించాలని లేఖ రాసినట్లు చెప్పారు. ఈ పరిస్థితుల్లోనే మేడిగడ్డ నుంచి 240 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల తాగునీటి అవసరాలకే సుమారు 50 టీఎంసీలు అవసరమవుతాయని, సాగునీటి అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.
వార్ధా, చెన్నూరు ప్రాజెక్టులనూ ముందుకు తీసుకెళ్లాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. వార్ధా నదిపై 20 టీఎంసీల నీటి వినియోగంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నివేదిక వెనక్కి వచ్చిందని, ఆ తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్లలేదని విమర్శించారు. తమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి తమకు అభ్యంతరం లేదని, అయితే నీటి లభ్యత, ఆయకట్టు, వ్యయం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. రూ.25 వేల కోట్లతో తమ్మిడిహట్టి నుంచి నీటిని తీసుకొచ్చి సుందిళ్లలో పోస్తారంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తారా? ఉత్తమ్‌కు సవాల్
తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకొస్తామని చెబుతున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన వాదనను సమర్థించే సమగ్ర ప్రాజెక్టు నివేదికను బయటపెట్టాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. గ్రావిటీ ద్వారా నీటిని తీసుకురావడం సాధ్యమని నిరూపించాలని, లేకపోతే తనతో పాటు రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు అంచనాలు, నీటి లభ్యత, ఆయకట్టు వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. “నీళ్లను కొనలేం.. మరి అందుబాటులో ఉన్న నీటిని ఎందుకు ఎత్తడం లేదు?” అని ప్రశ్నిస్తూ, మేడిగడ్డకు వెంటనే మరమ్మతులు చేసి సాగు, తాగునీటి అవసరాలు తీర్చాలని కోరారు.

