తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సానుకూలం!
152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫడ్నవీస్ అంగీకారం
మహారాష్ట్రకు నష్టం లేకుంటే 148 మీటర్ల ఒప్పందంపై పునరాలోచన
గ్రావిటీ ద్వారా నీటి తరలింపునకు 152 మీటర్ల ఎత్తు అవసరం
ముంపు భూములకు పరిహారం చెల్లిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం
అధ్యయనానికి రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ ప్రతిపాదన
ఆదిలాబాద్ గిరిజనుల సాగు, తాగునీటి అవసరాలపై రేవంత్‌రెడ్డి వినతి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచాలన్న తెలంగాణ అభ్యర్థనను పునఃపరిశీలించేందుకు సిద్ధమని, మహారాష్ట్రకు, అక్కడి ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని నిర్ధారణ అయితే 148 మీటర్ల ఎత్తుకు సంబంధించిన గత ఒప్పందంపై పునరాలోచించేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమైంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, సాంకేతిక అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య కీలక చర్చలు జరిగాయి. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీటి సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1975 అక్టోబర్ 6న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, మహారాష్ట్రకు చెందిన ఎస్.బి. చవాన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి ఈ ప్రాజెక్టుపై వివిధ దశల్లో చర్చలు కొనసాగుతున్నాయని సమావేశంలో తెలంగాణ బృందం వివరించింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రాజెక్టు ముందుకు సాగలేదని పేర్కొంది. 2016లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిన విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రస్తావించారు. అయితే, ఆ ఎత్తుతో నిర్మాణం చేపడితే తెలంగాణ ప్రాంతానికి అవసరమైన తాగు, సాగునీటిని పూర్తిస్థాయిలో అందించడంలో పరిమితులు ఉంటాయని వివరించారు. అందువల్ల ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్లకు పెంచే ప్రతిపాదనను పరిశీలించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
గ్రావిటీ ద్వారా నీటి తరలింపునకు ప్రాధాన్యం
సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం, నీటి తరలింపు విధానం, నిర్వహణ వ్యయం, విద్యుత్ వినియోగం వంటి అంశాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టును రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే విధానంతో పోలిస్తే గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచే ప్రతిపాదనకు ఉన్న సాంకేతిక, ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను పరిశీలించాలని కోరారు.
ఆదిలాబాద్ గిరిజనుల సమస్యలను వివరించిన రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని వివరించారు. సుసంపన్నమైన చరిత్ర, ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు. గిరిజనులు, ఆదివాసీలు ఇప్పటికీ సాగు, తాగునీటి వంటి ప్రాథమిక అవసరాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆర్థిక అవకాశాలు పరిమితంగా ఉండటం, అభివృద్ధి ఫలాలు అందకపోవడం వంటి సమస్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొమురం భీమ్ సాగించిన జల్, జంగిల్, జమీన్ పోరాటాన్ని గుర్తుచేస్తూ, ఆదిలాబాద్ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనులు, ఆదివాసీల జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే సాగు, తాగునీటి సదుపాయాలు విస్తరించాల్సి ఉందని వివరించారు. వెనుకబడిన సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని కోరారు.
ముంపు భూములకు పరిహారం చెల్లించేందుకు సిద్ధం
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలో వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభావిత రైతులకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో అమల్లో ఉన్న భూసేకరణ నిబంధనలు, పరిహార విధానం ప్రకారం చెల్లింపులు చేపట్టేందుకు సిద్ధమని తెలిపారు. అయితే, ముంపునకు గురయ్యే భూముల విస్తీర్ణం, ప్రభావిత ప్రాంతాలు, పరిహారం వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం అవసరమని ఇరు రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. మహారాష్ట్రకు, అక్కడి ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదన్న అంశాన్ని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే బ్యారేజీ ఎత్తుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
152 మీటర్ల ప్రతిపాదనపై పునఃపరిశీలన
తెలంగాణ ప్రతిపాదనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. బ్యారేజీ ఎత్తును పెంచే అంశాన్ని మరోసారి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్రకు, అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా ఉంటే 148 మీటర్ల ఎత్తుకు సంబంధించిన ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ నీటి అవసరాలకు సహకరించేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. తెలంగాణతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సరిహద్దులోని ఆదిలాబాద్ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందని ఫడ్నవీస్ పేర్కొన్నారు. తన అమ్మమ్మ తెలుగు మాట్లాడతారని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్రాష్ట్ర సమస్యలను చర్చలు, పరస్పర సహకారంతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జాతీయ ప్రయోజనాలు, రెండు రాష్ట్రాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
అధికారుల కమిటీతో తదుపరి కార్యాచరణ
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, పరిహారం, సాంకేతిక అంశాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు. ఈ కమిటీ రెండు రాష్ట్రాల అంచనాలను పరిశీలించి, అవసరమైన సాంకేతిక వివరాలను సేకరించనుంది. ముంపు ప్రాంతాలు, ప్రభావిత భూముల విస్తీర్ణం, నీటి లభ్యతపై అధ్యయనం చేయడంతో పాటు అవసరమైతే ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించనుంది. కేంద్ర జల సంఘం పరిధిలో అవసరమైన అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనలు కొనసాగుతాయని సమావేశంలో ప్రస్తావించారు. అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్చలు, సమావేశాల కాలపరిమితులు, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.
విమానాశ్రయంతో సరిహద్దు ప్రాంతాలకు ప్రయోజనం
ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికీ ఊతం లభిస్తుందని రేవంత్‌రెడ్డి వివరించారు. రవాణా సదుపాయాలు మెరుగుపడటంతోపాటు ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని కేవలం సాగునీటి ప్రాజెక్టుగా కాకుండా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టుగా చూడాలని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలు, అభివృద్ధి అవకాశాలు అందని వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించి, సదస్సులో పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని తెలిపినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీపై జరిగిన చర్చల్లో రెండు రాష్ట్రాల మధ్య సాంకేతిక అంశాల పరిశీలనకు, తదుపరి సంప్రదింపులకు మార్గం సుగమమైంది. అయితే, 152 మీటర్ల ఎత్తుపై తుది నిర్ణయం అధికారుల కమిటీ అధ్యయనం, ముంపు ప్రభావం, నీటి లభ్యత, ఇతర సాంకేతిక అంశాల పరిశీలన అనంతరం తీసుకోవాల్సి ఉంది.

