పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు
రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు
పొలాల రహదారులకు రూ.100 కోట్లు నిధులు
తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం
యాసంగిలో తక్కువ నీటితో పండే పంటలే సాగు చేయాలి : మంత్రి తుమ్మల
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పేదలకు సొంతింటి కల నెరవేర్చడంతోపాటు రైతుల పొలాలకు రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మొదటి విడతలో 1,300కు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడతలో మరో 1,100 ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రైతుల పొలాలకు రహదారుల నిర్మాణానికి ఇప్పటికే రూ.75 కోట్లు మంజూరు చేశామని, త్వరలో మరో రూ.25 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. సోమవారం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి మండలంలో పర్యటించిన మంత్రి మల్లేపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం నల్లకుంట చెరువును సందర్శించారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన పేదలకు రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని, ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతిల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

రైతుల పొలాలకు రహదారులు
రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేలా రహదారుల నిర్మాణానికి మొత్తం రూ.100 కోట్లు అందుబాటులోకి రానున్నాయని తుమ్మల తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, ప్రజలకు ఉపయోగపడే పనులను వీబీ–జీ రామ్‌జీ పథకం ద్వారా చేపట్టాలని అధికారులకు సూచించారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో యాసంగిలో వరికి బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని మంత్రి రైతులకు సూచించారు. తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యమిస్తూ నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని కోరారు. రఘునాథపాలెం మండలంలో వెంకటాయపాలెం డీప్‌కట్ నుంచి మంచుకొండ లిఫ్ట్ ద్వారా 25 చెరువులకు, బుగ్గవాగు నుంచి మరో 11 చెరువులకు నీరందించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పుట్టకోట నీటి వనరులను నింపాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ప్రజాప్రతినిధులు రాయల నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య, ఇరిగేషన్ డీఈ మోతీలాల్, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.

