బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!
అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి
10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు
పాలేరు పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని మూడో శతాబ్దానికి చెందిన చారిత్రక బౌద్ధ స్తూపాన్ని అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం బౌద్ధ స్తూపం పరిసరాల్లో పర్యాటక సదుపాయాల కల్పన, చారిత్రక కట్టడాల సంరక్షణ, పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 50–55 ఏళ్ల క్రితం గుర్తించిన ఈ స్తూపం దేశంలోని అతిపెద్ద బౌద్ధ స్తూపాల్లో ఒకటని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో పురావస్తు తవ్వకాల్లో లభించిన ప్రాచీన వస్తువులను భద్రపరిచేందుకు స్థానికంగా వసతులు లేక హైదరాబాద్ మ్యూజియంలో ఉంచారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు బౌద్ధ కట్టడాలపై అవగాహన ఉన్న నిపుణులు, అధికారులతో సమావేశం నిర్వహించి అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న తుది బిల్లులను మరో పది రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఎలాంటి లంచాలకు తావులేకుండా చెల్లింపులు జరిపే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. నేలకొండపల్లి రైతు వేదికలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. మండలంలో మొదటి విడతలో మంజూరైన 648 ఇళ్లలో సుమారు 620 పూర్తయ్యాయని, మిగిలిన వాటిని కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్, నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండో పంట వేయవద్దని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు అనాసాగరం నుంచి పమ్మి వరకు 2.5 కిలోమీటర్ల మేర రూ.2.80 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించారు. కుసుమంచి మండలం గోరిళ్లపాడు తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏదులాపురం మున్సిపాలిటీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర టీఎస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

