కేంద్రమే కొనుగోలు చేయాలి
ఖరీఫ్ కోసం సన్న రకాలు సిద్ధం
మే 4 నుండి 9 వరకు రైతు ఉత్సవాలు
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
విత్తన లభ్యత, సాగు ప్రణాళికలపై సమీక్ష
శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులకు కీలక సూచనలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించి, పంటలను కొనే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపై వేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. దీంతో రాష్ట్రంపై అధిక భారం పడుతుందని తెలిపారు. ఎంఎస్పీ ప్రకటించిన ప్రతి పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. సచివాలయంలో వ్యవసాయశాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులతో సమావేశమైన మంత్రి తుమ్మల.. వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం అందుబాటులో ఉంచాల్సిన వరి రకాల ఎంపిక, విత్తన లభ్యత, సాగు ప్రణాళికలపై వ్యవసాయశాఖ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయశాఖ అధికారులు వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం సన్న రకాలను సిద్ధం చేసినట్లు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత సంవత్సరం 33 రకాల సన్న రకాలను అందుబాటులో ఉంచడం వలన రైతులు అమ్మకాల సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు, కొన్నింటికి బోనస్ కూడా రాకుండా ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు.
సమస్యలు రాకుండా..
ఈ సంవత్సరం అలాంటి సమస్యలు రాకుండా పరిమిత రకాలు, రైతులకు అధిక దిగుబడి ఇచ్చే రకాలు అందుబాటులో ఉంచడంపై దృష్టిపెట్టాలని మంత్రి స్పష్టం చేశారు. సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేసుకొని, రాష్ట్రం, కేంద్రం కొనుగోలు చేసే పరిమాణాల ఆధారంగా విత్తనాల సరఫరా ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుండి 9 వరకు జరిగే రైతు ఉత్సవాల కార్యక్రమంలో మే 4 వ తేదిన ఈ విత్తనాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మే 15 కల్లా ఎంపిక చేసిన విత్తన రకాలను రైతులకు సిద్ధంగా ఉంచాలని అధికారులకు అన్నారు. అధిక దిగుబడి, మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలనే అందుబాటులో ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు.
విత్తనాలను అందుబాటులో ఉంచాలి
సీడ్ కార్పొరేషన్ ద్వారా ఈ విత్తనాలను సరఫరా చేయడంతో పాటు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఇదే రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం విత్తన కంపెనీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని వ్యవసాయశాఖ సెక్రటరీకి సూచించారు. వచ్చే మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో కూడా ఇదే విషయంపై చర్చించాలని సూచించారు. ఈ రకాలతో రైతులకు మేలు జరగాలని, ప్రభుత్వం ఏఏ పంటలను కొనాలనుకుంటుందో రైతులు ముందుగానే తెలుసుకునేలా వివరాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఎంఎస్పీ శాస్త్రీయంగా లేదని, కేంద్ర ప్రభుత్వం విధానాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతు కమిషన్ చైర్మన్ కొదండరెడ్డి అన్నారు. ఎంఎస్పీ విషయంలో రైతు సంఘాల, స్వామి నాథన్ కమిషన్ సిఫారసులను కేంద్రం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వంపై 2000 నుండి 3000 కోట్లు అదనంగా భారం పడుతుందని, అయినప్పటికి కేంద్రం నుండి ఎలాంటి సహాకారాలు అందడం లేదని మంత్రి అన్నారు. ఎంఎస్పీ ప్రకటించే ప్రతి పంటను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మంత్రి డిమాండ్ చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయ అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

