రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే
రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన.. ప్రత్యామ్నాయం బీజేపీయే
రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
ఘనంగా ‘పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్’
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ‘పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, రాజకీయ కార్యాచరణపై కార్యకర్తలకు నిరంతరం శిక్షణ ఇవ్వడం బీజేపీ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందని రాంచందర్ రావు అన్నారు. “రాష్ట్రంలో పేర్లు మారినా పాలన మారలేదు. గత ప్రభుత్వం సంపదను దోచుకుంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నుంచి ఢిల్లీకి రూ. 1,000 కోట్లు పంపే ప్రయత్నం చేస్తోంది. అందులో కనీసం సగం నిధులైనా ఉద్యోగుల సంక్షేమానికి ఎందుకు కేటాయించకూడదు?” అని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు.
తెలంగాణ కోసం పోరాడింది మేమే..
తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తుచేశారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే సమయంలో నాటి టీఆర్ఎస్ ప్రతినిధులు గైర్హాజరయ్యారని, కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిస్థాయిలో పోరాడలేదని విమర్శించారు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో నిలబడింది తమ పార్టీయేనని చెప్పారు. ఇప్పటికే మండల స్థాయిలో 50 వేల మందికి పైగా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చామని, త్వరలోనే జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని తెలిపారు. కార్యకర్తల కృషి, క్రమశిక్షణతో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

