పెట్రోల్ ఓ చోట.. డీజిల్ మరోచోట..
ముదిగొండలో అస్తవ్యస్తంగా ఇంధన సరఫరా
బంకుల చుట్టూ వాహనదారుల ప్రదక్షిణలు
పట్టించుకోని పౌరసరఫరాల శాఖ అధికారులు
కాకతీయ, ముదిగొండ: ముదిగొండ మండలంలో ఇంధన సరఫరా వ్యవస్థ పట్ట తప్పింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఇంధన సంక్షోభం విచిత్ర మలుపులు తిరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే దొరుకుతుండగా, మరికొన్ని చోట్ల కేవలం డీజిల్ మాత్రమే విక్రయిస్తున్నారు. దీంతో అవసరమైన ఇంధనం కోసం వినియోగదారులు ఒక బంకు నుంచి మరో బంకుకు కిలోమీటర్ల మేర చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. పెట్రోల్ కోసం బంకుకు వెళ్తే.. “డీజిల్ మాత్రమే ఉంది” అని, డీజిల్ కావాలని వెళ్తే “పెట్రోల్ మాత్రమే ఉంది” అని బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారులు విస్మయానికి గురవుతున్నారు. మండుతున్న ఎండలో ఇంధనం కోసం బంకుల చుట్టూ తిరగలేక, గంటల తరబడి క్యూల్లో వేచి ఉండలేక సామాన్యులు విలవిలలాడుతున్నారు. సరఫరా వ్యవస్థలో సమన్వయం లోపించడం, పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ కరవవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సమయం వృథా.. జనం బేజారు..
ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. అత్యవసర పనులపై వెళ్లే వారు సైతం ఇంధనం కోసం అల్లాడుతున్నారు. “ఒక బంకులో ఒకటే ఇంధనం ఉండటం ఏమిటి? ఇలాంటి నిర్వహణ వల్ల ప్రజల సమయం, డబ్బు వృథా అవుతున్నాయి” అని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సరఫరాను గాడిలో పెట్టాలని, అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ సమానంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముదిగొండ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

