ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
కేసీఆర్ నాయకత్వంపైనే ప్రజలకు నమ్మకం
ముదిగొండ సెంటర్లో జెండా ఆవిష్కరించిన నేతలు
కాకతీయ, ముదిగొండ: తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ముదిగొండ మండల కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ నేతృత్వంలో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు సాగిన పోరాట ప్రస్థానాన్ని నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ముదిగొండ సెంటర్లో గ్రామ పార్టీ అధ్యక్షుడు తెరల రామారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. “రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ నాయకత్వానికే ప్రజలు పట్టం కడతారు” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్ మందరపు లక్ష్మీ వెంకన్న, ఉద్యమ నాయకులు పి. కోటేష్ యాదవ్, ముస్లిం మైనార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఖాజా, మండల నాయకులు కొమ్మూరి రమేష్, నాయిని వెంకన్న, మల్లారపు నరేష్, ఆన్తోటి ఉదయ్ కుమార్, పటాన్ మస్తాన్, షేక్ అజీజ్, షేక్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

