ఎరువుల దుకాణాల బంద్ విజయవంతం
రాష్ట్రవ్యాప్త పిలుపుతో నిలిచిన విక్రయాలు
రవాణా ఛార్జీల భారం తగ్గించాలని డిమాండ్
కాకతీయ, కారేపల్లి: తెలంగాణ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ అండ్ సీడ్ డీలర్ల సంఘం పిలుపు మేరకు సోమవారం ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలో ఎరువుల దుకాణాల బంద్ విజయవంతమైంది. డీలర్ల సమస్యలతో పాటు రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా ఈ నిరసన చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు. బంద్ కారణంగా మండలంలోని దుకాణాలన్నీ మూతపడటంతో వ్యవసాయ కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఈ సందర్భంగా డీలర్లు మాట్లాడుతూ.. ఎరువుల సరఫరాలో రవాణా ఛార్జీల భారం తమపై పడకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీలే నేరుగా దుకాణాలకు సరుకును సరఫరా చేయాలని, అదనపు కిరాయిల భారం లేకుండా చూడాలని కోరారు. ప్రధానంగా ఎరువుల కొనుగోలుకు కంపెనీలు లింకులు విధించడం వల్ల అటు రైతులు, ఇటు డీలర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని విమర్శించారు. లింకులు లేకుండా ఎరువులను అందుబాటులో ఉంచాలని, సీజన్‌కు సరిపడా నిల్వలను ప్రైవేట్ దుకాణాలకు సరఫరా చేయాలని కోరారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీలర్లు సురేందర్ మనియార్, రావూరి కిషన్ రావు, భాగం నాగేశ్వరరావు, అజ్మీరా నాగేశ్వరరావు, అజ్మీర నరేన్, ముక్క సీతారాములు, కాటేపల్లి కార్తీక్, ఆంగోత్ వినోద్ కుమార్, గుగులోత్ మోహన్, గణేష్ మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.

