లారీ – ఆటో ఢీ.. : ఒకరు మృతి
మరో ఎనిమిది మందికి గాయాలు
పినపాక మండలం గొట్టెల్ల వద్ద ప్రమాదం
కాకతీయ, మణుగూరు/పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. కరకగూడెం నుంచి మణుగూరు వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను, పినపాక మండలం గొట్టెల్ల ప్రాంతంలో లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను మణుగూరులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న కరకగూడెం మండలానికి చెందిన ఈసం గోపయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏడూర్ల బయ్యారం ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లారీ కోసం పినపాక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


