ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
సన్న రకానికి రూ.500 బోనస్
వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్
కాకతీయ, గజ్వేల్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులకు అమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్ సూచించారు. సోమవారం ఆమె సీఈఓ జితేందర్ రెడ్డితో కలిసి మజీద్‌పల్లి, అంబర్‌పేట, వేలూరు, నాచారం, మైలారం, వర్గల్, తునికి ఖల్సా, నెంటూర్, పాములపర్తి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ మోహన్ మాట్లాడుతూ.. సన్న ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 అదనపు బోనస్ చెల్లిస్తుందని గుర్తుచేశారు. గ్రేడ్-1 రకం ధాన్యానికి రూ.2,389, రెండో రకం ధాన్యానికి రూ.2,369 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టి, నాణ్యత ప్రమాణాలతో కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, నాయకులు చెన్నయ్య, కుమార్, యాదగిరి, రాజశేఖర్ రెడ్డి, కొండల్ రెడ్డి, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

