జనగణనలో భాగస్వాములు కావాలి
పథకాల అమలుకు ఖచ్చితమైన సమాచారం అవసరం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
కాకతీయ, ఖమ్మం: జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఖమ్మంలోని ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో ఆయన వెబ్‌సైట్ ద్వారా తన వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఈ ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం వల్ల సమాచార సేకరణ మరింత వేగంగా, సులభంగా జరుగుతుందని తెలిపారు. “తెలంగాణలోని ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. సరైన గణాంకాలు ఉన్నప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా అందుతాయి” అని ఆయన ఆకాంక్షించారు. ముందుగా అధికారులు స్వీయ గణన వెబ్‌సైట్ పనితీరును, వివరాల నమోదు ప్రక్రియను డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్, చీఫ్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ హిమవర్ష మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

