ఏజెన్సీ చట్టాలకు తూట్లు!
అనుమతి లేకున్నా బహుళ అంతస్తులు!
పంచాయతీ నోటీసులు బుట్టదాఖలు
‘మేము మొనార్కులం’ అంటూ ప్రబుద్ధుల సవాల్!
శ్రీనగర్‌లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలు
రాజకీయ ఒత్తిళ్లతో మిన్నకుండిపోతున్న అధికారులు?
1/70 చట్టం అమలులో ఉన్నా బేఖాతరు..
కాకతీయ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలోని శ్రీనగర్ గ్రామపంచాయతీ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. ఏజెన్సీ చట్టాలను, పంచాయతీరాజ్ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతి లేని ఈ ‘పేక మేడల’పై చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మౌనంగా ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని 1/70 చట్టం ప్రకారం.. ఇక్కడ ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే సంబంధిత పంచాయతీ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ, శ్రీనగర్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అనుమతులు లేకున్నా ఒకటి నుంచి మూడంతస్తుల వరకు భవనాలను యథేచ్ఛగా నిర్మిస్తున్నారు. అధికారులు ధైర్యం చేసి ప్రశ్నిస్తే, “మేము అంతే కడతాం.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు” అంటూ నిర్మాణదారులు బహిరంగంగానే సవాళ్లు విసురుతున్నారు. పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చినా, వాటిని కనీసం పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తుండటం గమనార్హం.
ద్వంద్వ వైఖరిపై ప్రజల ఆగ్రహం
అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకుంటే నిబంధనలు గుర్తుచేసే అధికారులు, రాజకీయ పలుకుబడి ఉన్న బడా బాబులు బహుళ అంతస్తులు కడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. మండల స్థాయి అధికారులు, తహసీల్దార్‌కు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడం వెనుక భారీగా చేతులు మారాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కఠిన చర్యలు తప్పవు: పంచాయతీ కార్యదర్శి వంశీ
శ్రీనగర్ గ్రామపంచాయతీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై పంచాయతీ కార్యదర్శి వంశీ ‘కాకతీయ’తో మాట్లాడారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా చేపడుతున్న భవనాలపై ఇప్పటికే నిఘా పెట్టామన్నారు. పలువురికి నోటీసులు జారీ చేశామని, నిబంధనలను ధిక్కరిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. అధికారులు హెచ్చరిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ఆగడం లేదు. మరి ఈ అక్రమ నిర్మాణాల ‘పేక మేడలు’ ఎప్పుడు కూలుతాయో, చట్టం తన పని తాను ఎప్పుడు చేస్తుందో వేచి చూడాలి.

