రాజ్యాంగ సాక్షిగా.. ఒక్కటైన ఇంజినీరింగ్ జంట!
మణుగూరులో ఆదర్శ వివాహం
అంబేద్కర్, బుద్ధుని సాక్షిగా ప్రమాణం
కాకతీయ,మణుగూరు : నేటి ఆధునిక కాలంలో ఆడంబరాలకు పోకుండా, వినూత్నంగా ఆలోచించి అంబేద్కర్ ఆశయ సాధనలో ఒక ఇంజినీరింగ్ జంట ఆదర్శంగా నిలిచింది. మణుగూరుకు చెందిన పూరేటి యాకోబు, సువర్ణ దంపతుల కుమారుడు రాజ్ కిరణ్, సామికలు శుక్రవారం రాజ్యాంగంపై ప్రమాణం చేసి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సింగరేణి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకకు సత్తుపల్లికి చెందిన డాక్టర్ కొచ్చర్ల శ్రీనివాసరావు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు లక్ష్మయ్య పర్యవేక్షకులుగా వ్యవహరించారు. వివాహానికి ముందు వధూవరులు అంబేద్కర్, గౌతమ బుద్ధుని చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి సమక్షంలోనే పరస్పరం పూలదండలు, ఉంగరాలు మార్చుకున్నారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా రాజ్యాంగంపై ప్రమాణం చేసి, ప్రమాణ పత్రాలను చదివి వినూత్నంగా వివాహం చేసుకున్నారు. ఈ అపురూప వేడుకను చూసేందుకు బంధుమిత్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
ఆడంబరాలకు స్వస్తి పలకాలి
ఈ సందర్భంగా కొచ్చర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేల రూపాయలు ఖర్చు చేస్తూ, గంటల తరబడి సమయాన్ని వృధా చేసుకోకుండా ఇలా ఆదర్శవంతంగా వివాహాలు చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. తాము ఇప్పటివరకు ఎన్నో వివాహాలను ఉచితంగా జరిపించామని, అంబేద్కర్ ఆశయాలను పాటించడం ఎంతో తృప్తినిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివిన యువత ఇలాంటి సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

