గూడెం అంతా ఎరుపుమయం..
మిన్నంటిన మే డే సంబరాలు
141వ మే డే సందర్భంగా రెపరెపలాడిన ఎర్రజెండాలు
పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
కాకతీయ, కొత్తగూడెం: శ్రమజీవుల స్వేచ్ఛా పోరాట స్ఫూర్తితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 141వ మే డే వేడుకలు శుక్రవారం అత్యంత ఘనంగా జరిగాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, కార్మిక వాడలన్నీ ఎర్రజెండాలతో నిండిపోయాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పలుచోట్ల జెండాలను ఆవిష్కరించి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. ఎనిమిది గంటల పనిదినం, కార్మిక హక్కుల సాధన కోసం చికాగో మహాసభలో జరిగిన పోరాట ఫలితమే నేటి మే డే అని గుర్తు చేశారు. శ్రమజీవుల హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక చట్టాల పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తరలివచ్చిన నాయకులు..
ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గెద్దాడ నగేష్, విద్యానగర్ ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి పిడుగు శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే కార్పొరేటర్లు బ్యాండ్ దుర్గా, దాసరి శ్రీనివాస్, పాలమూరు ధనలక్ష్మి, బండి నరసింహ, మాజీ కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యవర్గ సభ్యులు ఫహీం, ఖాయం, ముత్యాల అజయ్ యాదవ్, జహీర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

