పేదవాళ్ల ఇంటి కలను నెరవేరుస్తాం
సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల సాయం
నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ఎమ్మెల్యే మురళీ నాయక్
కాకతీయ, నెల్లికుదురు : ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేలా కృషి చేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ అన్నారు. మండలంలోని శ్రీరామగిరి గ్రామపంచాయతీలో శీలం అమృత-అశోక్, శీలం వెంకన్న-సత్యవతి దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ డీసీసీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డితో కలిసి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సొంత స్థలం ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, వికలాంగులు మరియు భూమి లేని నిరుపేదలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. మొదటి విడతలో ఇల్లు రాని వారు అధైర్యపడొద్దని, రెండో విడతలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి వారి సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాదారి ప్రశాంత్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదవ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

